బెల్లంపల్లి: మామిడితోటలకు జిల్లా ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో ప్రతియేటా రూ.200కోట్లకు పైగా మామిడికాయల వ్యాపారం జరుగుతోంది. ప్రకృతి ప్రభావంతో ఈసారి మామిడికాయల దిగుబడి గణనీయంగా పడిపోయి వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏటా ఉగాది పర్వదినం నాటికి ఓ మోస్తారు పరిమాణానికి వచ్చిన మామిడికాయలు మార్కెట్‌ను ముంచెత్తాల్సి ఉన్నా కనీసం కనిపించకుండా పోయాయి. ఉగాది పచ్చడికీ మామిడికాయల కొరత ఏర్పడిందంటే కాపు ఎంతగా పడిపోయిందో ఊహించుకోవచ్చు. వరుసగా గత రెండేళ్ల నుంచి మామిడికాయల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడం లేదు. కనీసం ఈసారైనా కాలం కలిసి వస్తుందనే ఆశతో ఉన్న మామిడితోటల రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. చెట్లకు ఈ దఫా పూత విరబూసినప్పటికీ చీడపీడలు ఆశించి 90శాతం వరకు రాలిపోగా, కొద్దిపాటిగా నిలిచిన పూత పిందె దశకు చేరగానే అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి.
ముఖం చాటేసిన నాగ్‌పూర్
వ్యాపారులు
సాధారణంగా మామిడిచెట్లకు పూత వచ్చే క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ బడా వ్యాపారులు, దళారులు వచ్చి మామిడి తోటలోని పూత ఆధారంగా లీజు ఒప్పందం చేసుకోవడం దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పూత భారీగా వచ్చి వెంటనే రాలిపోవడంతో వ్యాపారులు ఇటు వైపు రాలేదు. కనీసం వ్యాపారుల గుమాస్తాలు, దళారులు సందర్శించలేదు. పూతను అంచనా వేసి రైతులతో ఒప్పందం చేసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడాన్ని పరిశీలిస్తే దిగుబడి దుస్థితికి అద్దం పడుతోంది. కొందరు స్థానిక చిరు వ్యాపారులు కొంత మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకున్నా కాత లేక తోటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు.
సన్నగిల్లుతున్న ఆశలు
మామిడి తోటలను నమ్ముకున్న రైతులు ఏటా ఏదో ఒక తీరుగా నష్టపోతున్నా రు. ఓసారి కాలం కలిసిరాక, మరో ఏడాది మద్దతు ధర లేక.. ఇంకోసారి నాగ్‌పూర్ బడా వ్యాపారుల నయవంచనతో గి ట్టుబాటు ధర రాక ని లువుదోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. కోల్డ్ స్టోరేజీలు లే కపోవడం ప్రధాన స మస్యగా ఉంది. గతేడాది బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌లో ఏదో మొక్కుబడిగా అమ్మకాలు జరిగాయి. కా నీ రైతులు మద్దతు ధరకు నోచుకోలేక పోయారు. ఇన్ని రకా ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా తోటలపై ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కాపు కానరాని మామిడి తోట
వెలవెల
మామిడి చెట్లకు పూత నిలిచి కాత వస్తే ఎకరాకు గరిష్టంగా 3నుంచి 4టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఎకరాకు టన్ను కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో అత్యధికంగా భీమారం, జైపూర్, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, హాజీపూర్ మండలాల్లో మామిడితోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 15,475 ఎకరాల్లో మామిడితోటల పెంపకం ఉండగా.. బేరింగ్ ఏరియాలో 13వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాన్‌బేరింగ్ ఏరియా పరిధిలో 2,475 ఎకరాల్లో తోటలు ఉన్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో బంగెనపల్లి, దశేరి, హిమాయత్, తోతపురి, నీలం తదితర రకాల మామిడి తోటలు ఉన్నాయి.


