● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి
చెన్నూర్: చెన్నూర్ గోదావరి పుష్కరాలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చెన్నూర్ గోదావరి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభామేళా తరహాలో నిర్వహించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థ, పుష్కర ఘాట్ ప్రాంతంలో లైటింగ్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. పుష్కర స్నానాలకు రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్ల పనులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి, బస్సు డిపో, మినీ స్టేడియం నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, కమిషనర్ మురళీకృష్ణ, సీఐ బన్సీలాల్, కౌన్సిలర్లు, దేవాదాయ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయిస్తానని, సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి వివేక్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్లు, కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. మదనం పోచమ్మ ఆలయ పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


