గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు అంతంత మాత్రమే
పూర్తి పన్ను చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం
పన్నులో ఐదు శాతం రిబేట్
వసూలైతేనే మున్సిపాలిటీలకు నిధులు
మంచిర్యాలటౌన్: మున్సిపాల్టీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ‘ఎర్లీబర్డ్’ పథకం అమలు చేస్తోంది. పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు మార్చి నెలాఖరున ముగిసాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ముందస్తు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 మార్చి వరకు పూర్తి పన్ను బకాయిలు చెల్లించిన వారు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చెల్లించేందుకు అర్హులుగా పేర్కొంది. బకాయిలు పేరుకుపోకుండా, ముందస్తు చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఐదు శాతం రాయితీ అందిస్తుండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
విస్తృత ప్రచారాన్ని కల్పిస్తేనే
ఎర్లీబర్డ్ పథకానికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది విస్తృత ప్రచారం కల్పిస్తేనే పన్నులు వసూలవుతాయి. సరైన ప్రచారం లేకపోవడంతో గత ఏడాది చాలామందికి ఈ పథకం, రాయితీపై తెలియలేదు. మొన్నటి ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలు మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సవాల్‌గా మారింది. అంతంత మాత్రంగానే వసూలయ్యాయి. ఈ పథకంపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎర్లీబర్డ్ ద్వారా పన్ను చెల్లింపులపై ప్రచారం కల్పించేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం అయ్యారు.


