చెన్నూర్: చెన్నూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలి కల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు మృతిపై అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. చికిత్స పొందుతూ మృతిచెందిన నాటి నుంచి నేటి వరకు పాఠశాలలో చెన్నూర్ సీఐ బన్సీ లాల్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. విద్యార్థిని రాసిన కొన్ని లేఖలు పోలీసులు వద్ద ఉన్నాయి. వాటితోపాటు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నిరోషా ఎదుట విద్యార్థిని శ్రీహిందు ఇచ్చిన వాంగ్మూలమే కీలకం కానున్నట్లు తెలిసింది. పాఠశాలలో మానసిక బాధలు, తనకు ఉన్న అలవాట్లను అడ్డుకున్న ఉపాధ్యాయుల తీరుపై లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. గడ్డి మందు ఎక్కడి నుంచి తెచ్చుకుంది.. ఎందుకు తెచ్చుకుంది అనే విషయాలూ అందులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు విద్యార్థిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని వెంటనే స్పందించడంతో కీలక సమాచారం చిక్కినట్లు సమాచారం. విద్యార్థిని మరణవాగ్మూలం ఆధారంగా కారకులపై చర్యలకు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. గడ్డి మందు సేవించేందుకు ప్రేరణ ఎవరు కల్పించారు.. ఎందుకు మృతిచెందాలని అనుకుంది అనే విషయాలను రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
అన్ని కోణాల్లో విచారిస్తున్నాం
ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు గడ్డి మందు తాగి మృతిచెందిన ఘటనపై అన్ని కోణల్లో విచారణ చేస్తున్నాం. విద్యార్థిని మరణ వాంగ్మూలంతోపాటు స్వయంగా రాసిన లేఖలే కేసుకు కీలకం కానున్నాయి. మృతికి కారకులైన వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం.
– బన్సీలాల్, చెన్నూర్ సీఐ


