ఇద్దరు పార్ట్‌టైం ఉపాధ్యాయుల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పార్ట్‌టైం ఉపాధ్యాయుల తొలగింపు

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

● కాళేశ్వరం జోన్‌ జోనల్‌ అధికారి గిరిజ ● గురుకుల పాఠశాలలో విచారణ ● బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు

● కాళేశ్వరం జోన్‌ జోనల్‌ అధికారి గిరిజ ● గురుకుల పాఠశాలలో విచారణ

చెన్నూర్‌: చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పార్ట్‌టైం ఉపాధ్యాయులు సిహెచ్‌.సువర్ణ, శ్రీవాణిలను విధుల నుంచి తొలగించినట్లు కాళేశ్వరం జోన్‌ జోనల్‌ అధికారి గిరిజ తెలిపారు. సోమవారం గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు మృతిపై జిల్లా సమన్వయ అధికారి రామకళ్యాణితో కలిసి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా విచారణ చేపట్టామని తెలిపారు. విద్యార్థిని గడ్డిమందు సేవించిన విషయాన్ని హౌజ్‌టీచర్‌, సూపర్‌వైజర్లకు తెలియజేసినట్లయితే సరైన వైద్య సేవలు అందించేవారమని అన్నారు. విద్యార్థిని ద్రావణం సేవించిన విషయం చెప్పకపోవడంతో దురదృష్టకర సంఘటన జరిగిందని తెలిపారు. శ్రీహిందుకు మెరుగైన వైద్యం అందించాలని ఖర్చుల కోసం ప్రైవేట్‌ ఆసుపత్రికి రూ.26 వేలు ప్రిన్సిపాల్‌ అందజేశారని తెలిపారు. విద్యార్థిని మృతి విషాదకరమని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వ సహాయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రజాధనాన్ని వృథా చేస్తే ఊరుకోం

మంచిర్యాలటౌన్‌: అక్రమ టెండర్లు వేసి ప్రజాధనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగరర్‌రావు దోచుకుంటున్నారని, వేంపల్లిలో ఇండస్ట్రీయల్‌ పార్కు పేరిట పెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని, ప్రజాధనాన్ని వృథా చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది జూలై 13న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినప్పుడు హడావుడిగా పనులు చేశారని, దాదాపు ఏడాది తర్వాత చేసిన పనులకు ఈ నెల 11న రూ.1.48 కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. ఇప్పటికే దళితులు, బీసీలను బెదిరించి రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల విలువైన 200 ఎకరాల భూములను కేవలం ఎకరాకు రూ.13.50లక్షలు ఇచ్చి సంతకాలు సేకరించారని ఆరోపించారు. ఆ భూములను ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చిన వారికి కేటాయించేలా భారీ కుంభకోణానికి ప్రణాళిక సిద్ధం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అంకం నరేశ్‌ మాట్లాడుతూ పేదల కోసం కట్టించిన డబుల్‌ బెడ్‌రూంలను అర్హులకు అందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement