మంచిర్యాలటౌన్: జిల్లాలోని 14ఏళ్లు దాటి 15ఏళ్లలోపు ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపడుతోందని, అర్హులైన ఆడపిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పాతమంచిర్యాలలోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో సోమవారం ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టగా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్‌తోపాటు ఆర్థో, డెంటల్, సీ్త్ర వైద్య నిపుణులు, ఫిజీషియన్ ఇతర ప్రత్యేక వైద్యులు శిబిరంలో అందుబాటులో ఉంటారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ తూముల నరేష్, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, వైద్యాధికారి డాక్టర్ స్నేహిత, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, దీక్షిత రాణి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు.


