ఆదిలాబాద్‌టౌన్: ఆదిలా బాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అర్బాజ్(25) ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ వివాహితతో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం గతంలోనే ఇంట్లో తెలియడంతో పలుసార్లు అర్బాజ్‌ను మహిళ కుటుంబీకులు, భర్త మందలించారు. గతంలో కత్తితో దాడి చేసేందుకు వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కాలనీలో అర్బాజ్‌పై కర్రతో దాడి చేశారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి మహ్మద్ ఆరీఫ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సునిల్‌కుమార్‌ను సంప్రదించగా.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


