నస్పూర్: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఆర్పీ 3, ఎస్‌ఆర్పీ ఓసీ, సీహెచ్‌పీ, ఎస్సార్పీ 1, ఐకే 1, ఐకే ఓసీలలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతన రెస్టురూమ్‌ల ఏర్పాటుతోపాటు పాత వాటిని మరమ్మతు చేయాలన్నారు. ఎస్సార్పీ ఓసీ, సీహెచ్‌పీలో నూతన ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. సర్వే జనరల్ పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇప్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది, సర్పేస్ ఉద్యోగులకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని జీఎం తెలిపారు. గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రెటరీ బాజీసైదా, ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రమణారావు, అధికారులు రాజన్న, అనిల్‌కుమార్, ప్రశాంత్, అన్ని గనుల ఏజెంట్లు, గుర్తింపు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


