బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) గురుకుల కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేశారు. మెరిట్ వచ్చిన విద్యార్థులకు ప్రీమియర్ సీవోఈ గురుకుల కళాశాలల్లో సీటు లభించగా మిగతావారికి నాన్ ప్రీమియర్ సీవోఈ గురుకులాలు, సాధారణ గురుకులాల్లో ప్రవేశం పొందుతారు. కాగా, గతేడాది ప్రవేశ పరీక్షకు బదులు పదోతరగతి మార్కుల ప్రాతిపదికన అడ్మిషన్ కల్పించారు. దీంతో అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు రాణించలేక పోతున్నారనే అసంతృప్తి అధ్యాపకుల్లో ఉంది. అయితే, ఈసారి గతంలో మాదిరిగా ప్రవేశ ప్రకటన జారీ చేసి పోటీ పరీక్ష నిర్వహిస్తారా? లేక.. పదోతరగతి మార్కుల ప్రాతిపదికన ప్రవేశం కల్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఎస్సీ గురుకుల విద్యాలయ సంస్థ సొసైటీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బాలబాలికలకు రెండు నాన్ ప్రీమియర్ సీవోఈ కళాశాలలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి కేంద్రంగా బాలుర, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల గురుకుల సీవోఈ కళాశాలలు ప్రారంభించారు. సీవోఈ గురుకుల కళాశాలల విద్యార్థులు ఏటా జాతీయ, రారష్ట్‌రస్థాయి పోటీ పరీక్షలు రాసి ఐఐటీ, నీట్, నిట్, క్లాట్ తదితర అంశాలు, ఎంసెట్‌లో మెరుగైన ర్యాంక్‌లు తెచ్చుకుని ఇంజినీరింగ్, వ్యవసాయ తదితర కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. అయితే, ప్రవేశ ప్రకటన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం జారీ కాకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇతర విద్యాసంస్థల్లో చేరుతున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఎస్సీ సంక్షేమ సాధారణ గురుకుల, సీవోఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాని పరిస్థితి ఉంది.
ఏప్రిల్ మొదటివారంలో రావొచ్చు
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలోని సీవోఈ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీనిపై గురుకుల విద్యాలయ సొసైటీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రవేశ ప్రకటన వస్తుందనే భరోసాతో ఉన్నాం. – రమాకళ్యాణి, డీసీవో, మంచిర్యాల


