లోకేశ్వరం: ఓ వైపు ఉప్పొంగే పౌరుషం.. మరోవైపు ఈలలు, కేకలతో ప్రోత్సహించే యువతరం.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ మట్టికరిపించే విన్యాసం.. ఇవన్నీ ప్రేక్షకుల కాలు కదపనివ్వకుండా ఆసాంతం నిలబడి ఆస్వాదించేలా మల్లయోధులు కుస్తీలో తలపడ్డారు. మండలంలోని బిలోలి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తానూర్, ముథోల్, లోకేశ్వరం మండలాలతోపాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నాందేడ్ జిల్లా అర్ధపూర్ గ్రామానికి చెందిన సతీశ్‌యాదవ్ అనే మల్లయోధుడు ప్రథమ స్థానంలో నిలువగా వీడీసీ సభ్యులు రూ.8,016 నగదు బహుమతి అందజేశారు. విజేతలకు రూ.100 నుంచి రూ.8వేల వరకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు మండలంలోని హవర్గ, సాత్‌గాం, హథ్‌గాం, లోకేశ్వరం తదితర గ్రామాల ప్రజలు వచ్చారు.
ఎల్వోసీ అందజేత
శ్రీరాంపూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 31వ డివిజన్‌కు చెందిన పీ లక్ష్మి వైద్యఖర్చుల నిమిత్తం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు రూ.2.50లక్షల మొత్తానికి ఎల్వోసీ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం తన నివాసంలో అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ్ల సంపత్‌రెడ్డి, నాయకుడు బుద్ది మహేశ్ పాల్గొన్నారు.


