నిర్మల్ టౌన్: హిందువులపై ఎస్పీ జానకీ షర్మిల ప్రవర్తిస్తున్న తీరును అసెంబ్లీలో ప్రస్తావిస్తానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీరామ, హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎస్పీ జానకీ షర్మిల బాధ్యతలు తీసుకున్నాక హిందూ పండుగలపై వివక్ష కొనసాగుతోందని, ప్రతీ పండుగకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, హిందువులపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. హిందూ పండుగలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినుల మీద ఎస్పీ దురుసుగా మాట్లాడడం సరికాదని, ఎస్పీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్‌లో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్యుడిపై గురువారం జరిగిన దాడిని ఖండించారు. ఎస్పీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


