వేమనపల్లి: మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ కంచె జట్కా మిషన్లను వరుసగా చోరీ చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి మండల కేంద్రానికి చెందిన పాలె శ్రీనివాస్‌కు చెందిన సుమారు రూ.12వేల విలువైన జట్కా మిషన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు ప్రాణహిత వైపు ఆరెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సాగు చేశాడు. పంట రక్షణకు సోలార్ జట్కామిషన్‌తో కంచె ఏర్పాటు చేసుకున్నాడు. సోలార్ దొంగతనం చేసిన వ్యక్తులు అక్కడే మందు సేవించి ఖాళీ సీసాలు వదిలి వెళ్లారు. మూడు నెలల వ్యవధిలో మండల కేంద్రంలో పోటు వెంకటయ్య, ఎల్లెల గోపాల్, రామగిరి సాయి, రమేశ్‌రెడ్డి జట్కా మిషన్లు చోరీకి గురయ్యాయి. అలాగే, నాగారంలో మూడు, ఒడ్డుగూడెంలో రెండు, నీల్వాయిలో రెండు, గొర్లపల్లిలో రెండు.. జట్కా మిషన్లు ఎత్తుకెళ్లారు. వీటిని చిల్లర దొంగలు ఎత్తుకెళ్తున్నారా? లేదా.. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు చోరీ చేస్తున్నారా? అనేది అంతుచిక్కటం లేదు. బాధితులు కొందరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అనుమానితుల ఆచూకీ దొరకటం సవాల్‌గా మారింది.


