పెరుగుతున్న వ్యాధులు ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గు జొన్నరొట్టెలకు క్రేజ్..వీధికో విక్రయ కేంద్రం
నెన్నెల: బాబు బగర్ చక్కెర చాయ్ ఇవ్వు..జొన్న రొట్టె ఉందా... చపాతీ ఇవ్వండి..రాగిజావ కావాలి..నానా ఈ దోశ వెయ్యి.. ఇవీ ఇటీవల హోటళ్లు, కర్రీ పాయింట్ల వద్ద వినిపిస్తున్న మాటలు. నిత్యావసర దుకాణాలకు వెళ్తే ముందుగా డ్రైప్రూట్లు, మిల్లెట్లు, శనిగలు, పెసర్లు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు. షుగర్, బీపీ, గుండె సంబంధిత బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు నగరాలనే కలవరపెట్టిన వ్యాధులు కరోనా తర్వాత క్రమంగా గ్రామాలకు విస్తరించాయి. వీటిన బారినపడకుండా ఆహారంపై నియంత్రణ పాటిస్తున్నారు. పాత తరహా ఆహారపు అలవాట్లకు మళ్లుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు చిరుధాన్యాలు, జొన్నరొట్టెల వైపు మొగ్గుచూపుతుండటంతో రోడ్ల పక్కనే రొట్టెల విక్రయ కేంద్రాలు, కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. వ్యాధిగ్రస్తులతోపాటు 30 ఏళ్లు దాటిన వారు ఆహారపట్టికలో మార్పులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒకపూట అన్నం తింటూ ఉదయం, సాయంత్రం చపాతీ, జొన్నరొట్ట, మక్క గట్కా, రాగిజావ ఉండేలా చూసుకుంటున్నారు.
వందలో నలుగురు
బెల్లంపల్లికి చెందిన ఓ వైద్యుడి వద్దకు నిత్యం 80 నుంచి 100 మంది రోగులు వైద్యపరీక్షల కోసం వస్తున్నారు. వీరిలో కొత్తగా నలుగురైదుగురు మధుమేహ, రక్తపోటు బారినవారు ఉంటున్నారు. గతంలో 70 ఏళ్లు పైబడిన వారికే బీపీ, షుగర్ వచ్చేవి. ప్రస్తుతం 30–50 ఏళ్ల మధ్య వారే 50 శాతం ఉంటున్నారు. ప్రతీ వందమంది వ్యాధిగ్రస్తుల్లో 15 మంది కచ్చితమైన ఆరోగ్య నిమయాలు పాటిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతీ వందమందిలో 40 మంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్‌లో ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంటే ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. ఇవి మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


