చెన్నూర్‌రూరల్: భూతగాదాల కారణంగా తమ్ముడిపై దాడి చేసిన అన్న, అతని కుమారులను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెన్నూర్ సీఐ బన్సీలాల్ తెలిపారు. చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన జోగురు లక్ష్మిమల్లు, రాజయ్య అన్నదమ్ములు. వారి తాతలకు చెందిన భూమిలో వాటాల కోసం గతంలో పంచాయితీలు జరిగాయి. బుధవారం ఈ విషయమై వీరి కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తన కుమారులతో కలిసి లక్ష్మి మల్లు గొడ్డలి, కర్రలతో రాజయ్యపై దాడి చేశారు. తీవ్రగాయాలైన రాజయ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజయ్య కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్య నుంచి తహసీల్దార్ మల్లికార్జున్, ఎస్సై సుబ్బారావు వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నిందితులు జోగురు లక్ష్మిమల్లు, కుమారులు సమ్మయ్య, రవిలను అంగ్రాజ్‌పల్లి సమీపంలో అరెస్టు చేశారు. వారి నుంచి గొడ్డలి, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై శ్యామ్‌పటేల్, పోలీసులు పాల్గొన్నారు.


