ఎల్పీజీ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు
హోటళ్లలో వంటకాలపై తీవ్ర ప్రభావం
పెట్రోల్, డీజిల్ కొరత అంటూ వదంతులు
స్టాక్, సరఫరాలో ఇబ్బంది లేదంటున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ఎల్పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కొరత ఫుడ్ బిజినెస్ చేసే వారిని వేధిస్తోంది. మరోవైపు పెట్రోల్ బంక్‌ల్లోనూ బుధవారం ఇంధన నిల్వలు లేవంటూ వచ్చిన వదంతులతో వినియోగదారులు తిప్పలు పడాల్సి వస్తోంది. ఎక్కడా స్టాక్ నిల్వల్లో సమస్యలు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎల్పీజీ సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఇప్పటికే రోజువారీగా వంటలకాలపై ప్రభావం పడుతోంది. మరోవైపు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ తిప్పలు పడుతున్నారు. గ్యాస్‌పై సులువుగా చేసే వంటలు కట్టెల పొయ్యి కారణంగా ఆలస్యం అవుతున్నాయి.
ధరలపై ప్రభావం
గ్యాస్ ధరలకు తోడు నిత్యావసరాలైన నూనె, పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధానంగా ఫుడ్ బిజినెస్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే స్వీట్లు, హోటళ్లలో టిఫిన్స్, భోజనంలో కూరలు తగ్గించేశారు. హోటళ్లలో మెనూలో కూరలు, ప్రత్యేక వంటకాలు తగ్గాయి. ఇంతకుముందు పలు హోటళ్లలో భోజనంలో ఇచ్చిన రకాలు ప్రస్తుతం వినియోగదారులకు ఇవ్వడం లేదు. ఇక ప్రభుత్వ హాస్టళ్లు, ఆస్పత్రుల్లో భోజనాలకు ఇబ్బంది కలుగకుండా సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. వార్షిక పరీక్షలు రాసే వరకు హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి సెలవులు ఇచ్చే వరకు సరఫరా కొనసాగించనున్నారు.
వదంతులతో ఇబ్బందులు
యుద్ధం కారణంగా ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడంతో పెద్దయెత్తున వాహనదారులు తరలివస్తున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పలు బంకుల్లో బారులు తీరారు. పెట్రోల్ బంక్‌ల్లో కొరత లేదని ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు చెబుతున్నారు. గతంలో కంపెనీల డిపోల్లో అరువు తెచ్చుకుని పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం నగదు చెల్లింపులకే ఇవ్వడంతో డీలర్లకు ఇబ్బందులు వస్తున్నాయి. నగదు సర్దుబాటు కాని పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డులు పెట్టి తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. కాగా, జిల్లాలో ఎలాంటి కొరత లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు
జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో హోటళ్ల యజమానులకు సిలిండర్ల డిమాండ్‌తో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ను బ్లాక్‌లో రూ.500 అధిక ధరకు విక్రయిస్తున్నారు. మరోవైపు సొంత అవసరాలకు వాడే కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ అమ్ముతున్నారు. గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్‌గా వాడితే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారుల తనిఖీల్లో 85 సిలిండర్లు పట్టుబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 15వరకు 6ఏ కేసులు నమోదు చేశారు. ఇంకా ఫిర్యాదులు వచ్చిన చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఎల్పీజీ సరఫరాలో జాప్యంతో ఇప్పటికే నిల్వ తగ్గుతోంది. రోజువారీగా గృహావసర సిలిండర్లు ఇప్పటివరకు జిల్లాలో నాలుగు వేలకు పైగా బుకింగ్ నమోదవుతోంది. వీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఒక్కోరోజు సగటున 3800 నుంచి 3,900 సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. మిగతా సుమారు 200 వరకు కొరత ఏర్పడుతోంది.


