పెట్రోల్‌ బంకుల్లో బారులు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో బారులు

Mar 26 2026 7:34 AM | Updated on Mar 26 2026 7:34 AM

● పలు చోట్ల నో స్టాక్‌ బోర్డులు ● క్యాన్లలో నింపి అక్రమంగా విక్రయాలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పెట్రోల్‌ కొరత వదంతులతో బుధవారం పలుచోట్ల బంక్‌ల్లో వినియోగదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు కనిపించడంతో మిగతా చోట్ల ఎగబడ్డారు. కొందరు మోటారుసైకిళ్లు, కార్లలో ఐదు లీటర్ల నుంచి 20లీటర్ల వరకు పోయించుకున్నారు. మరికొందరు వ్యాపారులు పెట్రోల్‌, డీజిల్‌ క్యాన్లలో 50 నుంచి వంద లీటర్లు విక్రయించారు. లీటర్‌కు అదనంగా రూ.30 నుంచి రూ.50వరకు గల్లీల్లో వాహనదారులకు విక్రయిస్తున్నారు. పెట్రోలియం చట్టం 1934 ప్రకారం క్యాన్లు, ఇతరత్రా డబ్బాల్లో వందల లీటర్లు నింపుకోవడం నేరం.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ఉదయం నుంచే బారులు

జిల్లాలో 78 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. ఒక్కో బంక్‌లో 4వేల నుంచి 10వేల లీటర్ల వరకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు ఉంటాయి. ఈ లెక్కన నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల వరకు విక్రయిస్తారు. 20వరకు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి. లభించిన చోట వాహనదారులు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకున్నారు. బుధవారం ఒక్క రోజే 5.5లక్షల లీటర్లు విక్రయించడం గమనార్హం. కొరత వదంతులతోనే విక్రయాలు భారీగా పెరిగాయి.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు..

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. వదంతులు నమ్మొద్దు. అవసరాల మేరకు బంకుల్లో ఉంది. కొన్ని బంక్‌లు పాత బకాయిలు చెల్లింపు చేయనందున వాళ్లకు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ ఇంధన కంపెనీ నుంచి ఇవ్వడం లేదు. అంతర్గత సమస్యలు, అలాంటి వాటి వద్ద మాత్రమే నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. క్యాన్లలో నింపుతున్నట్లు మా దృష్టికి వస్తే ఆ బంక్‌లపై చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌రావు, జిల్లా అదనపు

కలెక్టర్‌(రెవెన్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement