మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) భవనం శిథిలావస్థకు చేరింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, సహాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడపాల్సి వస్తోంది. నిత్యం 400కు పైగా ఓపీ సేవల కోసం రోగులు వస్తుండగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే వారు 200 మంది వరకు ఉంటారు. వైద్యులు, సిబ్బంది మరో 200 మంది వరకు విధులు నిర్వర్తిస్తుండగా.. పారిశుద్ధ్య సిబ్బంది, వాచ్‌మెన్ ఇతరత్రా సిబ్బంది 150 మంది ఉంటారు. రోగులతో వచ్చే సహాయకులు 500 మంది వరకు ఉండగా.. నిత్యం ఆస్పత్రిలోని వార్డులు, వరండా కిటకిటలాడుతుంటాయి. అరకొర వసతులతోనే కొన్నేళ్లుగా ఆస్పత్రి నిర్వహణ ఉండగా.. మూత్రశాలలు సక్రమంగా లేక, ఉన్నవాటినే రోగులు, సహాయకులు వినియోగిస్తున్నారు. బుధవారం ఓ రోగి సహాయకురాలిగా వచ్చిన మహిళ మూత్రశాలలో ఉన్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులూడి పడడంతో గాయాలయ్యాయి. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రెండు నెలల్లో నూతన
భవనంలోకి..
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో నూతన భవనంలోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరి స్లాబు పెచ్చులూడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కొనసాగిస్తున్నాం.
– డాక్టర్ వేదవ్యాస్, ఆసుపత్రి
సూపరింటెండెంట్


