‘వాహన్‌’ సేవలు షురూ | - | Sakshi
Sakshi News home page

‘వాహన్‌’ సేవలు షురూ

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): వాహనాల వివరా లన్నీ ‘వాహన్‌’లో తెలియనున్నాయి. వాహన్‌ పోర్టల్‌ను జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించగా.. ఇకపై వాహనదారులకు దీని ద్వారానే సేవలు అందనున్నాయి. రిజిస్ట్రేషన్‌, బదిలీలు, ఎన్‌ఓసీలు తదితర అన్ని రకాల వాహన సేవలు లభించనున్నాయి. ఫిట్‌నెస్‌, పర్మిట్‌, బీమా, ఇంజన్‌, ఛాసిస్‌ నంబర్‌ తదితర అన్ని రకాల వివరాలు నమోదై ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు 50 నుంచి 100 వరకు నూతన వాహన రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2,36,620 వరకు ద్విచక్ర వాహనాలు ఉండగా, 26,480 వరకు కార్లు, 45,510 ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్‌ జరిగి ఉన్నాయి. షోరూమ్‌లలో బండి కొనుగోలు చేసిన సమయంలోనే ఆ వాహనానికి సంబంధించి పూర్తి డేటా ‘వాహన్‌’ పోర్టల్‌లో నమోదు చేస్తారు. కొత్త వాటితోపాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన మొత్తం వాహనాల వివరాలూ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.

సేవలు ఇలా..

‘వాహన్‌’ సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. నకిలీ బీమా పత్రాలతోపాటు పర్మిట్లు, ఫిట్‌నెస్‌ సేవలు, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లకు ఇక తావుండదు. బీమా సంస్థ, బ్రాంచి, బీమా పత్రాలు పక్కగా నమోదవుతాయి. ప్రతీ షోరూమ్‌ ‘వాహన్‌’తో అనుసంధానమై ఉండడం వల్ల వాహన ఇంజన్‌, ఛాసిస్‌ నంబర్లు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, బీమా చెల్లబాటు గడువు వంటి వివరాలు తెలుస్తాయి. వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే ఫైనాన్స్‌ సంస్థల వివరాలు కూడా నమోదై ఉండడంతో బోగస్‌ ఫైనాన్స్‌ సంస్థ పేరిట రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఆటో రిక్షా తదితర వాహనాలకు రుణాల పేరిట దోపిడీకి పాల్పడే ఫైనాన్స్‌ సంస్థల ఆటకట్టవుతుంది. ఏ సంస్థ నుంచి ఎంత రుణం తీసుకున్నారనే హైపొతికేషన్‌ వివరాలూ ఉంటాయి. ‘వాహన్‌’ పోర్టల్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించిన వెంటనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులువుగా వాహనాల బదిలీ చేసుకోవచ్చు. డీలర్లు, బీమా సంస్థలు, ఫైనాన్స్‌ సంస్థలు, కాలుష్య నియంత్రణ సంస్థలు ‘వాహన్‌’ పోర్టల్‌తో అనుసంధానమై ఉండడం వల్ల రవాణా సేవలు ఇకపై సులభంగా పొందవచ్చు. ఇప్పటికే వాహన షోరూం నిర్వాహకులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం పోర్టల్‌ వినియోగంలోకి రావడంతో ఆగిన షోరూం రిజిస్ట్రేషన్‌లు ముందుకు సాగనున్నాయి. వాహనదారులకు పారదర్శకంగా సేవలు అందడంతోపాటు వాహనదారుల ఇబ్బందులు తొలగిపోనున్నాయని మంచిర్యాల ఇంచార్జీ డీటీఓ రంజిత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement