తాండూర్: గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మంగళవారం తాండూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, నాయకులతో కలిసి వీధులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మురికి కాలువల్లో పూడిక తీయించాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. వీధి దీపాల సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని, వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడడంతోపాటు పైపులైన్ లీకేజీలను అరికట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలన్నారు. సర్పంచ్ ముడిమడుగుల సురేష్, డీఎల్‌పీఓ సతీష్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీఓ అనిల్, పంచాయతీ కార్యదర్శి దివాకర్, ఉపసర్పంచ్ సత్యం, ఏఓ సుష్మ, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ పాల్గొన్నారు.


