ఆసక్తి ఉన్నవారికి ఆర్మీ కోచింగ్ ఇస్తున్న జన్నారం వాసి ఇప్పటి వరకు 146 మంది ఆర్మీ, నేవీకి ఎంపిక 26న ఆదిలాబాద్‌లో మరో బ్యాచ్‌కు శిక్షణ
జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీ కిష్టాపూర్ తండాకు చెందిన బానోత్ రాజునాయక్, లత దంపతుల ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, సాయికృష్ణ 2018లో ఒకేసారి ఆర్మీలో చేరారు. వంశీకృష్ణ జవాన్‌గా సాయికృష్ణ పూణేలోని ఆర్మీ మెడికల్ డిపార్టుమెంటులో రేడియాలజీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఇంటిని విడిచి వెళ్లడం ఇష్టంలేని తల్లిదండ్రులు పెద్దకుమారుడిని తిరిగి రావాలని కోరగా వంశీకృష్ణ ఉద్యోగం వదిలి వచ్చాడు. ఇంటివద్ద ఖాళీగా ఉండడం ఇష్టంలేక 2023లో ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న పరిసర గ్రా మాల్లోని పదిమంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. అందులో నలుగురు ఆర్మీకి ఎంపికయ్యారు.
ఉచితంగా శిక్షణ
ఇక్కడితో శిక్షణ ఆపకూడదనే సంకల్పంతో ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా డు. శిక్షణలో చేరిన కొందరు నగదు రూపేనా ఇవ్వడంతో వాటితో నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులకు శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించాడు. సెలవులపై ఇంటికి వచ్చిన సాయికృష్ణ ఖా ళీగా ఉండకుండా ఫిజికల్ ఈవెంట్‌లో వారికి మెలకువలు నేర్పించాడు. మూడేళ్లలో అతని వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలో ఉద్యోగం సాధించారు.
దేశానికి సేవ చేసేందుకు వెళ్లి తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగి వచ్చిన యువకుడు తనలాంటి ఎందరినో దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా శిక్షణ ఇచ్చి దేశ సేవ కోసం పంపిస్తున్నాడు. జన్నారం మండలానికి చెందిన ఈ యువకుడి వద్ద శిక్షణ పొందిన 146 మంది యువకులు ఆర్మీ, నేవీలలో ఉద్యోగంలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 26 నుంచి మరో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కథనం.


