మంచిర్యాలరూరల్(హాజీపూర్): వ్యవసాయంలో సాంకేతికత, పరిజ్ఞానంతో పాటు పంటల సాగు, అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పోసింది. పదేళ్లుగా ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో ‘ఆత్మ’ అలంకారప్రాయంగా మారింది. దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లాకు రూ.16.06 లక్షల నిధులు కేటాయించడంతో శిక్షణ, క్షేత్ర పర్యటనలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
రైతులకు చేకూరుతున్న ప్రయోజనాలు
ఆత్మ సంస్థ ద్వారా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న శిక్షణ కార్యక్రమాలతో రైతులకు ఎనలేని ప్రయోజనాలు దరి చేరాయి. జిల్లాకు రూ.16.06 లక్షల నిధులు కేటాయించగా జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షణలో రైతులకు విస్తృత సేవలు అందుతున్నాయి. వ్యవసాయ సాగుపై రైతులకు శిక్షణ ఇప్పించడం, పంట క్షేత్రాలకు తీసుకువెళ్లి సాగులో మెలకువలు, భూసార పరీక్షలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సాగులో ఆధునిక పద్ధతులు వివరిస్తూ రైతులను చైతన్యం చేస్తున్నారు. త్వరలో కిసాన్ మేళాలు ఏర్పాటు చేసి రైతులను మరింత చైతన్యం చేయనున్నారు.
రైతుల ప్రయోజనం కోసమే
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రైతులకు శిక్షణ, అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆత్మ ద్వారా రైతులకు ఇకపై సేవలు రెగ్యులర్‌గా అందుతాయి. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించే దిశగా ఆత్మ కార్యక్రమాలు ఉండనున్నాయి. త్వరలోనే కిసాన్ మేళా ద్వారా రైతులను సాగులో మరింత చైతన్యం చేయనున్నాం.
– సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి


