మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆధ్వర్యంలో చే పట్టిన అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న పార్టీ శిక్షణ తరగతులు ఆదివారం ముగియగా రఘునాథ్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో స్థానిక సమస్యలపై కూడా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఓదెలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్, నాయకులు అమిరిశెట్టి రాజ్‌కుమార్, సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, రంగ శ్రీశైలం, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, కమలాకర్‌రావు, జోగుల శ్రీదేవి, ఆకుల అశోక్‌వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


