రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 24లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, దీనిపై త్వరలో గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. అసెంబ్లీ, కౌ న్సిల్‌లో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతామ ని పేర్కొన్నారు. అవసరమైతే కోర్టు దిక్కరణ కింద మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. క్యాతనపల్లిలో 14 స్థానాలు బీఆర్‌ఎస్–సీపీఐ గెలుచుకు న్నా ఏడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అధికార, పోలీ స్ బలాన్ని ఉపయోగించి తమపై లాఠీచార్జీ చేయించి అన్యాయంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ స్థానాలు బీఆర్‌ఎస్, సీపీఐ కూటమివేనని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్, సంపత్ తదితరులున్నారు.


