అందరి చూపు ‘చెన్నూర్’ పైనే..
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల్లో అందరి చూపు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంపైనే ఉంది. మున్సిపల్ ఎన్నికలను మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైర్మన్ పీఠం కై వసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఏపార్టీ జెండా ఎగురవేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
రెండోసారి ఎన్నికలు..
చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి మున్సిపాలిటీ ముందుగానే ఉన్నప్పటికీ 1/70 చట్టం ఉండడంతో మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలు 2018–19లలో ఏర్పాటు చేశారు. 2021లో రెండు మున్సిపాలిటీలకు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గత బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో పైచేయి అధికార కాంగ్రెస్సా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్సా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అన్నివార్డుల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు రావడంతో మంత్రి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఓటరు చేతిలోనే పార్టీల భవితవ్యం..
ఈ నెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు చేతిలోనే పార్టీల భవితవ్యం దాగి ఉంది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు.
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు
చెన్నూర్ 18 19,903
క్యాతన్‌పల్లి 22 28,239


