‘చే’జిక్కిన పల్లె
మూడు విడతల్లోనూ కాంగ్రెస్ విజయబావుటా
పల్లె పోరులో జోరు తగ్గిన బీఆర్‌ఎస్
సత్తా చాటిన స్వతంత్రులు
నామమాత్రంగా బీజేపీ
ముగిసిన పంచాయతీ సమరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడు విడతల్లో సాగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ జోరు తగ్గింది. స్వతంత్రులు సత్తాచాటి అధిక స్థానాలు కై వసం చేసుకున్నారు. బీజేపీ నామమాత్రంగా మారి రెండంకెలకు చేరుకోలేపోయింది. తొలి, మలి విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయం సాధించగా.. మూడో విడతలోనూ హవా కొనసాగించారు. మొదటి విడత మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. మలి విడత బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మూడో విడత చెన్నూర్ నియోజకవర్గం భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తంగా 306 గ్రామ పంచాయతీలకు గాను 12సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం, దండేపల్లి మండలం గూడెం, నెల్కివెంకటాపూర్, వందూరుగూడ గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 290 పంచాయతీల్లో ఏకగ్రీవాలతో కలిపి 183 స్థానాల్లో కాంగ్రెస్, 59 చోట్ల బీఆర్‌ఎస్, 50 గ్రామాల్లో స్వతంత్రులు, తొమ్మిది చోట్ల బీజేపీ, ఒకచోట సీపీఐ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. స్వతంత్రులుగా గెలిచిన పలు స్థానాల్లోని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులుగా ఉండి.. రెబల్స్‌గా గెలిచిన వారే కావడం గమనార్హం. రాష్ట్ర మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్‌తోపాటు డీసీసీ, నాయకులు గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు రెబల్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చి మరీ గెలుపొందారు. పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రచారం చేసినా బీఆర్‌ఎస్ పార్టీ అధిక స్థానాలను గెలుచుకోలేకపోయింది. మరోవైపు ప్రతిపక్షం కోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు సాగించినా పట్టు దొరకలేదు. కాగా, జిల్లాలోని 16మండలాల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, పోలీసు అధికారుల కృషితో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మూడో విడతలో మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
నియోజకవర్గాల వారీగా ఫలితాలు..
నియోజకవర్గం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ స్వతంత్ర
మంచిర్యాల 90 06 81 53 16 09 – 09
బెల్లంపల్లి 114 02 111 81 25 –– 01 06
చెన్నూర్ 102 04 98 49 18 –– –– 35
మొత్తం 306 12 290 183 59 09 01 50


