మిట్టపల్లిలో ఉద్రిక్తత
జైపూర్: మండలంలోని మిట్టపల్లిలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు కామెర మనోహర్ సోదరుడు మధ్యాహ్నం ఓటింగ్ ముగిసిన తర్వాత కొన్ని బ్యాలెట్ పత్రాలతో కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లాడని, బాక్సులను మార్చే ప్రయత్నం చేశారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి అరాచకాలు, హత్య రాజకీయాలను ప్రో త్సహిస్తున్నారని ఆరోపించారు. షెట్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకుడిపై కత్తితో దాడి చేశారని, కోటపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారని రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేశారని అన్నారు. మిట్టపల్లిలో రెండు గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపును రెండు గంటలు ఆలస్యం చేశారని తెలిపారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపీ వెంకటేశ్వర్ జోక్యం చేసుకుని లెక్కింపు కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించామని, ఎలాంటి పొరపాట్లు జరగలేదని, కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లిన మనోహర్ సోదరుడిపై కేసు నమోదు చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.
ఇందారంలో..
ఇందారంలోనూ ఉదయం స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఎండీ.ఫయాజ్ కుమారుడు, బంధువులు పోలింగ్ కేంద్రంలో డబ్బులు పంచుతూ ప్రచారం చేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి వెన్నంపల్లి సాగర్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు సపోర్టు చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు.
బావురావుపేటలో..
చెన్నూర్‌రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు తాటి శ్రీనివాస్‌గౌడ్, స్వతంత్ర అభ్యర్థి పబ్బ జ్యోతి పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్‌గౌడ్‌కు రెండు ఓట్లు ఎక్కువ రాగా, జ్యోతి మద్దతుదారులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లో ఒక్క ఓటు తేడా వచ్చింది. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని, తమకు పోలైన ఓట్లలో చెల్లనిని ఎక్కువ ఉన్నాయని స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు పట్టుబట్టడంతో గొడవకు దారి తీసింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో అధికారులు మళ్లీ రీకౌంటింగ్ చేశారు. శ్రీనివాస్‌గౌడ్ రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు.
మిట్టపల్లిలో ఉద్రిక్తత


