‘అమృత్ స్టేషన్’ పనుల పరిశీలన
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో చేపట్టిన పనులను సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ బుధవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, వాహనాల పార్కింగ్ తదితర పనులు తనిఖీ చేశారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. లోకో ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రైల్వే ఉద్యోగులు డీఆర్‌ఎం దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. రైల్వేస్టేషన్‌లో ఆటోస్టాండ్ ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు నిర్మించాలని మాజీ కౌన్సిలర్ కే.చంద్రశేఖర్, ఆటోడ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. సీనియర్ డీసీఎం షిఫాలి, డీవోఎం నిఖిల్, రైల్వేస్టేషన్ మేనేజర్ ముత్తినేని రవీందర్ పాల్గొన్నారు.


