జేసీబీ యజమాని ఆత్మహత్యాయత్నం
జన్నారం: జేసీబీ యజమాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం కల్లెడకు చెందిన వెంబడి శేఖర్ మండలంలోని బాదంపల్లిలో తన అత్తగారింటిలో ఉంటూ జేసీబీ నడుపుకొంటున్నాడు. ఈనెల 14న పుట్టిగూడ సమీపంలో బాల్‌నాయక్ పొలంలో జేసీబీతో వ్యవసాయ బావి తవ్వాడు. బావి నుంచి వచ్చిన మట్టిని ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాడు. ఈక్రమంలో అటవీ అధికారులు వచ్చి జేసీబీకి తాళం వేశారు. రైతు బాల్‌నాయక్ పట్టా పాస్‌బుక్ తీసుకెళ్లి చూపించగా తిరిగి తాళాలు ఇచ్చారు. మంగళవారం అటవీ అధికారులు మళ్లీ వచ్చారు. జేసీబీ ని సీజ్ చేసేందుకు తాళాలు ఇవ్వాలని శేఖర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపంతో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ లాక్కుని అతడిపై నీళ్లు పోశారు. ఈ విషయమై సెక్షన్ అధికారి బోజ్యనాయక్‌ను సంప్రదించగా, ఇకో సెన్సిటివ్ జోన్ నిబంధనల ప్రకారం మొరం తరలించడం నేరమని తెలిపారు. పట్టా భూమిలో మొరం తీసే అనుమతి లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జేసీబీని సీజ్ చేసేందుకు వస్తే రాద్ధాంతం చేస్తున్నాడని వివరించారు.


