‘ఇంటర్‌’ ఫీజు చెల్లించలేం..! | - | Sakshi
Sakshi News home page

‘ఇంటర్‌’ ఫీజు చెల్లించలేం..!

Dec 14 2025 12:03 PM | Updated on Dec 14 2025 12:03 PM

‘ఇంటర్‌’ ఫీజు చెల్లించలేం..!

‘ఇంటర్‌’ ఫీజు చెల్లించలేం..!

విద్యార్థులకు ఆర్థికంగా భారం

డ్రాపౌట్‌ అవుతున్న వైనం

చెల్లించని వారు 728మంది

ఈ నెల 16వరకు అపరాధ రుసుంతో గడువు

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ ఫి బ్రవరి 2నుంచి, వార్షిక పరీక్షలు 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.630 వార్షిక పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు అదనంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్‌ 14 వరకే పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అపరాధ రుసుం రూ.వెయ్యితో డిసెంబర్‌ 3నుంచి 9వరకు అధికారులు అవకాశం కల్పించారు. అయినా చాలామంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ నెల 16నాటితో అపరాధ రుసుం రూ.2వేలతో చెల్లింపు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల వివరాలపై ఇంటర్‌ విద్యాశాఖ ఆరా తీస్తోంది. రెగ్యులర్‌గా కళాశాలకు వస్తున్నారా, గైర్హాజరుకు కారణాలేమిటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు, కారణాలు ఏమిటనే విషయాలపై దృష్టి సారించారు. జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 4,114 మంది విద్యార్థులు ఉన్నారు. 3,386మంది(82.3శాతం) మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. 728మంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 2,438మందికి గాను 1974మంది ఫీజు చెల్లించగా.. 464 మంది ఇంకా కట్టాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,676 మందికి గాను 1,412 మంది ఫీజు చెల్లించారు. ఇంకా 264మంది విద్యార్థులు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడానికి గల కారణాలపై ఇంటర్మీడియెట్‌ బోర్డుకు నివేదించనున్నట్లు తెలుస్తోంది.

ఆర్థికంగా భారం..!

పరీక్ష ఫీజు చెల్లించకపోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల్లో ఎక్కువ మందికి తల్లి ఉంటే తండ్రి లేకపోవడం, ఇద్దరూ లేకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, నానమ్మ ఇళ్లలో ఉంటున్నారు. వారాంతాల్లో పని చేస్తూ చదువుతున్న వారే కావడంతో ఫీజులు చెల్లించలేక డ్రా పౌట్‌గా మారుతున్నారు. ఇక అపరాధ రుసుం రూ.2వేలతో చెల్లించాలంటే ఆర్థికంగా భారమవుతుంది.

కళాశాలకు గైర్హాజరు

ప్రభుత్వ కళాశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తరచూ గైర్హాజరవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఉదయం 8గంటలకు బయల్దేరితే ఇళ్లకు వెళ్లసరికి రాత్రి అవుతుండడంతో ఆకలికి తాళలేక మధ్యాహ్నమే వెళ్లిపోతున్నారు. మరికొందరు కుటుంబ పరిస్థితుల కారణంగా సీజనల్‌ పనుల్లో నిమగ్నం కావడంతో రావడం లేదని తెలుస్తోంది. పత్తి, మిర్చి ఏరడం, దుక్కులు దున్నడం వంటి పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్‌, పుస్తకాలు తదితర సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో ఇళ్లలో కుటుంబ పెద్దలు అభ్యంతరం చెప్పకపోవడంతో బడిబాట పడుతున్నారు. ఇంటర్‌కు వచ్చే సరికి ఖర్చులు పెరిగిపోవడం, పనుల్లో సాయం చేయాల్సి రావడం వల్ల డ్రాపౌట్లుగా మారుతున్నారు.

జిల్లాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ ఫస్టియర్‌ విద్యార్థి రమేష్‌(పేరు మార్చం)కు తల్లిదండ్రులు లేరు. నానమ్మ ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు తొమ్మిదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా.. రమేష్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడం, నానమ్మ వృద్ధాప్యం కారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో పని చేయాల్సి వస్తోంది. పరీక్ష ఫీజు రూ.630 చెల్లించలేని పరిస్థితి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక భారం నేపథ్యంలో చాలామంది విద్యార్థులది ఇదే పరిస్థితి.

విద్యార్థి, అధ్యాపకుల మధ్య దూరం

పరీక్ష ఫీజు చెల్లింపులపై విద్యార్థులకు అధ్యాపకులు ఫోన్లు చేస్తే ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కళాశాలలో అడ్మిషన్లు పొందినప్పుడు ఓ నంబరు ఇవ్వడం, తర్వాత మార్చడం వల్ల ఫోన్‌ పని చేయడం లేదు. దీంతో విద్యార్థి, అధ్యాపకుల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా కష్టతరంగా మారుతోంది. రాక రాక కళాశాలకు వస్తే పాఠాలు అర్థం కాక గైర్హాజరుకే మొగ్గు చూపుతున్నారు. ఇదివరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు రెండు మూడు విడతల్లో చెల్లింపులు ఉండేది. ప్రస్తుతం ఒకేసారి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలనే నిబంధన కూడా పేద విద్యార్థులకు గుదిబండగా మారింది. పరీక్ష ఫీజు రూ.630 చెల్లించలేని విద్యార్థి రూ.2వేలు అపరాధ రుసుం ఎలా చెల్లిస్తాడో అధికారులకే తెలియాలి. పరీక్ష ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుంతో మూడు రోజుల్లో గడువు ముగుస్తుందని ఫోన్‌ చేసి అధ్యాపకుడు సూచిస్తే.. ‘మీరే చెల్లించండి సారూ.. నేను పనిచేసిన డబ్బులు వచ్చాక మీకు ఇస్తా..’ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడడం విద్యార్థుల ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. పేద విద్యార్థులు ఇంటర్‌ పరీక్షకు దూరం కాకుండా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement