జిల్లా టీఈఈ 1104 యూనియన్ కార్యవర్గం ఎన్నిక
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా టీఈఈ 1104 యూనియన్ ఎన్నికల సర్వసభ్య సమావేశం శనివారం కంపెనీ అధ్యక్షుడు బి.రఘునందన్ అధ్యక్షతన వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా బొమ్మ సత్తిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆర్.రవికుమార్, కార్యదర్శిగా కొండయ్య, అదనపు సెక్రెటరీగా జీవీఎం పరమేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడిగా తోట్ల కొమురయ్య, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కండె శ్రీనివాస్, కార్యదర్శిగా బొలిశెట్టి రాజన్న, అదనపు సెక్రెటరీగా జాడి రాజేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు, 2011 బ్యాచ్ జూనియర్ లైన్‌మెన్ ఏరియర్స్, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, ఎన్‌ఎంఆర్‌లను ఆర్టిజన్‌లుగా గుర్తించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా పోరాడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కంపెనీ కార్యదర్శి ఎస్.వెంకటరమణారావు, సలహాదారు టి.శేషగిరిరావు, వివిధ జిల్లాల నాయకులు, 300 మంది కార్మికులు పాల్గొన్నారు.


