బాధ్యత మరవని గిరిజనులు
దండేపల్లి: ఊళ్లోనే పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ కొందరు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కానీ దండేపల్లి మండలం కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామ ఆదివాసీ గిరిజనులు ఏ ఎన్నికలు వచ్చినా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటెయ్యాలి. ఆగ్రామంలో సుమారు 50 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏం జరిగినా.. దూరం అని భావించకుండా ఓటు వేయడం మాత్రం మరువడం లేదు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో బాధ్యతగా ఓటేసి పాలకులను ఎన్నుకుంటున్నారు.


