పులి వచ్చిందోచ్..!
జన్నారం: నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు పులి అలజడి సృష్టించింది. జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి గ్రామ సమీపంలో ఉన్న భీమన్నగుట్ట వద్ద ఆవుపై దాడి చేసి హతమార్చింది. బుధవారం విష యం తెలుసుకున్న జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్, ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, ఎఫ్ ఎస్‌వో రవి సిబ్బందితో కలిసి భీమన్న గుట్ట ప్రాంతంలో పరిశీలించారు. మామిడితోటలో ఆవు కళేబ రం కనిపించింది. ఆవు వెనుకభాగంపై దాడి చేసి తి నడం గమనిస్తే ఇది పులి దాడేనని ఎఫ్‌డీవో తెలి పా రు. పరిసరాల్లో అడుగులను గుర్తించారు. అటవీ స మీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. అటవీ, చేను, పొలాల్లో కరెంటు తీగలు అమర్చవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలోకి మేకలు, గొర్రెల కాపరులు వెళ్లకూడదని తెలిపారు.
నాలుగేళ్లకు..
జన్నారం అటవీ డివిజన్‌లో నాలుగేళ్ల క్రితం మహ్మదాబాద్ బీట్ పరిధిలో, కడెం ప్రాంతంలో పులి కెమెరాకు చిక్కింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోకి రాలేదు. రెండేళ్ల క్రితం ఆవుపై దాడి చేసినా అది పులి అని అధికారులు నిర్ధారించలేదు. ఎట్టకేలకు పులి జన్నారం డివిజన్‌లోకి రావడంపై అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలను గమనిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది.. ఎక్కడ ఉంది అనే అంశాలు పరిశీలిస్తున్నారు. పులి దాడి చేసి ఆవును చంపిందనే వార్త బయటకు రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.


