నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
నస్పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో అదనపు ఎన్నికల అధికారి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, నోడల్ అధికారి శంకర్‌తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల నుంచి ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, ఫలితాలు వంటి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నామినేషన్లు తీసుకోకూడదని, ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎన్నికల గుర్తులు కేటాయింపులో జాగ్రత్త వహించాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు, అధికారులు పాల్గొన్నారు.


