భౌబోయ్ కరుస్తున్నాయ్..!
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలపై కుక్కల దాడులు శస్త్రచికిత్సలు చేసినా అదుపులోకి రాని సంతతి ఎనిమల్ కేర్ సెంటర్ మూసివేతతో మరిన్ని ఇబ్బందులు సుప్రీంకోర్టు ఆదేశాలతో శునకాల తరలింపు తప్పనిసరి
మంచిర్యాలటౌన్: జిల్లాలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల కాలంలో శునకాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కుక్కల స్వైరవిహారం పెరిగింది. వీధులతోపాటు ప్రధాన రహదారులపై గుంపులుగా సంచరిస్తూ కరుస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా వెళ్లిన వారిని వెంటాడి కరుస్తుండడం, ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ‘విద్యాసంస్థలు, ఆస్పత్రులు, క్రీడామైదానాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జనం రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా తగిన ఏర్పాటు చేయాలి. వాటిని ప్రత్యేక షెడ్లకు తరలించండి’ అంటూ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నివారణ చర్యలకు తప్పని ఇబ్బందులు
కుక్కల నియంత్రణకు అవకాశం లేకపోవడంతో సంతతి పెరగకుండా మంచిర్యాల నగరంలోని ఆండాళమ్మ కాలనీలో రెండేళ్ల క్రితం ఎనిమల్ కేర్ సెంటర్(జంతు సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఎక్కడి కుక్కలను అక్కడే వదిలేల రెండేళ్లపాటు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించి ఒక్కో కుక్కకు కు.ని ఆపరేషన్‌కు రూ.1,650 చెల్లించారు. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాల్టీల వీధి కుక్కలను తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. రెండేళ్లలో 1,414 వీధి కుక్కలకు శస్త్రచికిత్స చేసిన ఏజెన్సీ నిర్వాహకులు ఎనిమల్ కేర్ సెంటర్ మూసేసి వెళ్లిపోయారు. దీంతో నెల రోజులుగా వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. జనసంచారం లేని ప్రాంతాలకు కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జిల్లాలో అమలు కాకపోవడం, కొన్ని ప్రాంతాల్లోని కుక్కలను మంచిర్యాల నగర శివారులో వదిలి పెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మంచిర్యాల ఎనిమల్ కేర్ సెంటర్‌లో
గత రెండేళ్లలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, చేసిన ఖర్చులు
మున్సిపాలిటీ కు.ని ఖర్చు
ఆపరేషన్లు
మంచిర్యాల కార్పొరేషన్ 970 రూ.17 లక్షలు
బెల్లంపల్లి 50 రూ.82 వేలు
మందమర్రి 55 రూ.88 వేలు
చెన్నూరు 100 రూ.1.65 లక్షలు
లక్సెట్టిపేట 88 రూ.1.45 లక్షలు
క్యాతన్‌పల్లి 151 రూ.2.49 లక్షలు
తరలించేలా చర్యలు
వీధికుక్కల సంతతి నియంత్రణకు జంతు సంరక్షణ కేంద్రాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయగా, ఏజెన్సీ నిర్వాహకులు వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకు బహిరంగ ప్రదేశాల్లోని వీధికుక్కల తరలింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, జనసంచారం లేని ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల మంచిర్యాల నగరంలో ఇతర ప్రాంతాలకు చెందిన కుక్కలు ఎక్కువగా వస్తుండడంతో ఇబ్బందిగా మారుతోంది. – సంపత్‌కుమార్,
కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్
భౌబోయ్ కరుస్తున్నాయ్..!


