ఏ విద్యార్థి.. ఏ బడిలో..!
చదివేది ఓ చోట.. ఆన్‌లైన్‌లో మరోచోట సర్కారు స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్‌తో తేలిన లెక్క ‘ప్రైవేటు’ విద్యార్థుల లెక్కల్లో వ్యత్యాసం పై తరగతిలో విద్యార్థులకు తప్పని తిప్పలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదివిన విద్యార్థి నాలుగేళ్ల క్రితం మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేరాడు. అక్కడి పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్‌లో టీసీ ఇవ్వకున్నా ఇక్కడి స్కూల్ నిర్వాహకుడు మ్యానువల్‌గా రిజిష్టర్‌లో పేరు నమోదు చేసుకుని ప్రవేశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షకు అవసరమైన నామినల్ రోల్(విద్యార్థి పూర్తి డేటా) చేసేటప్పుడు ఆన్‌లైన్(యూడైస్)లో లేదనే విషయం బయటపడింది. దీంతో ఆ విద్యార్థికి నామినల్ రోల్ అవకాశం లేదని పరీక్ష విభాగం అధికారులు అభ్యంతరం చెప్పారు. అప్పటికప్పుడు తప్పును సరిదిద్దుకునేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పెద్దపల్లి పాఠశాల నుంచి పేరు తొలగించి(డ్రాప్‌బాక్స్ క్లియర్ చేయించి) ప్రస్తుత పాఠశాల నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా చాలా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థి వివరాలు ఆన్‌లైన్‌లో ఓ చోట.. చదువుతున్నది మరోచోట కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన యూడైస్ ప్లస్ విద్యార్థుల డేటా ఎంట్రీ ప్రక్రియపై పాఠశాలల యాజమాన్యం అలసత్వం వహిస్తోంది. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆధార్, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు అప్‌డేట్ చేయాలి. దీంతో విద్యార్థుల డ్రాపౌట్ స్థితి, ప్రగతి వివరాల నమోదు తెలిసిపోతుంది. కొత్తగా చేరిన విద్యార్థులను చేర్చడం, స్కూల్ నుంచి వెళ్లిపోయిన వారిని డ్రాప్‌బాక్స్‌లోకి పంపిస్తారు. ప్రతీ విద్యార్థికి శాశ్వత నమోదు, విద్య నంబరు, అపార్ ఐడీ సృష్టిస్తారు.
ప్రైవేటు స్కూళ్లలో డ్రాప్ ఆట
ప్రైవేటు పాఠశాలల యజమానుల డ్రాప్ ఆట అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫీజు వసూళ్ల కోసం కొన్ని చోట్ల విద్యార్థుల వివరాలు యూడైస్(చైల్డ్ ఇన్ఫో)లో సకాలంలో నమోదు చేయడం లేదు. విద్యార్థి స్కూల్ మారినప్పుడు టీసీ ఇచ్చేసినా ఫీజు బాకీ ఉన్నారనే నెపంతో యూడైస్ కోడ్ ద్వారా చైల్డ్ ఇన్ఫోలో పేర్లు తొలగించడం లేదు. దీంతో వేరే పాఠశాలల్లో చేరినా పేరు నమోదు కాకుండా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పూర్వ పాఠశాల టీసీ లేకుండానే కొత్త పాఠశాలల్లో చేర్చుకోవచ్చు. విద్యార్థి వెళ్లిపోయినప్పుడు డ్రాప్‌బాక్స్‌లో వేయాలి. ఫీజు బాకీల నెపంతో యజమానులు ఆ పని చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆన్‌లైన్ పూర్వ పాఠశాలల్లో కనిపిస్తుండగా.. రిజిష్టర్‌లో పేరు నమోదు చేసి ఫీజులు వసూలు చేస్తూ చదివిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉందో లేదో అనేది తల్లిదండ్రులకు తెలియదు.. ఫీజులు వస్తుండడంతో యూడైస్‌తో తమకు పట్టింపు లేదని పాఠశాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థికి ఇక్కట్లు తప్పడం లేదు. పదో తరగతికి వచ్చిన తర్వాత పిన్ నంబరు, అపార్ ఐడీ గుర్తుకొస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో పేరు నమోదు కాగా.. నామినల్ రోల్‌కు అవకాశం లేకుండా పోతోంది. ఇందులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, సామాజిక వర్గం, తదితర వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగానే మెమో, ఇతర పరీక్ష సంబంధిత కార్యకలాపాలకు సిద్ధం చేస్తారు.
ప్రభుత్వ బడిలో ఇలా..
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య కచ్చితంగా తెలిసిపోతోంది. యూడైస్ ఆధారంగానే మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫా మ్ తదితరవన్నీ అమలవుతాయి. ఎక్కడ చదువుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు తర్వాత విద్యార్థుల లెక్కల్లో వ్యత్యాసానికి చెక్ పడింది. బడి నుంచి వెళ్లిపోయారంటే డ్రాప్‌బాక్స్ కు పంపడం చకచకా జరిగిపోతుంది. ప్రైవేట్‌లో నూ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తే విద్యార్థుల లెక్క తేలనుంది. యూడైస్ నమోదులో రాష్ట్రంలోనే మంచి ర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 709 ప్రభుత్వ పాఠశాలల్లో 42,950 మంది విద్యార్థులు ఉండగా.. 16 మంది పలు సాంకేతిక కారణాల వల్ల ఇంకా రిజిష్టర్ కాకుండా పోయింది.
ఎంత వ్యత్యాసమో..?
మంచిర్యాల పట్టణంలో 55 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 23,445 మంది విద్యార్థులు రిజిష్టర్ నమోదై ఉండగా యూడైస్‌లో 21,388 మంది మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. మిగతా 2057 మందిపై ఎటూ తేలకుండా పోతోంది. ఇందులో 13పాఠశాలల్లో రిజిష్టర్, ఆన్‌లైన్‌లో పెద్ద వ్యత్యాసం కనిపించకపోయినా.. నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.
ఆన్‌లైన్ చేయాల్సిందే..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల వివరాలన్నీ యూడైస్ ప్లస్‌లో నమోదు చేయాలి. ప్రైవేటు పాఠశాలల యజమానులు ఫీజు బకాయిలు ఇతరత్రా కారణాలతో కొంత ఆలస్యం చేస్తున్నారు. ఇదే విషయమై యజమానులతో సమావేశం నిర్వహించి కచ్చితంగా డ్రాప్‌బాక్స్ క్లియర్ చేయాలని సూచించాం. విద్యార్థి ఏ పాఠశాలలో చదువుకుంటే అక్కడే ఉన్నట్లు పరిగణిస్తాం.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల


