ధాన్యం అక్రమాల కేసులో విచారణ
జైపూర్: జిల్లాలో కలకలం రేపిన వరి ధాన్యం అక్రమాల కేసులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం నుంచి రూ.1.39కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయ డం, ఈ కేసులో 13మందిపై కేసులు నమోదు కావడం తెలిసిందే. ఎనిమిది మంది బినామీల పేర్లతో 740 ఎకరాల్లో 6,322 క్వింటాళ్ల ధాన్యాన్ని పండించినట్లుగా చూపి రామారావుపేట శివారులోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రవాణా చేసినట్లుగా ప్రభుత్వం నుంచి రూ.1.39 కోట్లు కాజేసినట్లు రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సివిల్‌సప్లయి జిల్లా మేనేజర్ శ్రీకళ, డీఎస్‌వో రాంబ్రహ్మం, డీటీ స్రవంతి, రెవెన్యూ శాఖ టీసీ సంతోష్ సమక్షంలో సీజ్ చేసిన ధాన్యం నిల్వ లను పరిశీలించారు. సీజ్ చేసిన ఆరువేల క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో 13మంది నిందితులు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడంతో ఎత్తివేసే వరకు వారిని అరెస్టు చేయడం వీలు కాదని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.


