వలస వస్తున్న కూలీలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ పత్తి ఏరేందుకు సరిపడా కూలీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి రప్పించాల్సి వస్తోంది. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉండడంతో కూలీల కొరత ఏర్పడింది. స్థానికంగా కూలీలు లభించకపోవడంతో పెద్దమొత్తంలో సాగు చేసిన రైతులు వాహనాలు సమకూర్చి రప్పిస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యాన రాష్ట్రాలకు చెందిన కూలీలు జిల్లాలోని వివిధ మండలాలకు వలస వచ్చారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి రైలుమార్గం ద్వారా వస్తున్న వారు కొందరు కాగా.. రైతులు సమకూర్చిన వాహనాల్లో మరికొందరు వస్తున్నారు. స్థానికంగా తాత్కాలిక గుడారాలు వేసుకుని పత్తి తీత పనులు చేపడుతున్నారు. కుటుంబంతో కలిసి మూడు నెలలపాటు ఇక్కడే ఉండేందుకు గుడిసెలు వేసుకున్నారు. రైతులు విద్యుత్, నీటి సౌకర్యం, వంటచెరుకు సమకూర్చుతున్నారు. ముందుగా తీసుకొచ్చిన రైతుల చేన్లలో పత్తి తీసిన తర్వాత ఇతర రైతుల పత్తి ఏరాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకుంటున్నారు. కిలో పత్తితీతకు రూ.10 నుంచి రూ.12 చెల్లిస్తున్నారు. ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నాలుగేళ్లుగా పక్క రాష్ట్రాల నుంచి..
జిల్లాలో వానాకాలంలో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 1.69 లక్షల ఎకరాల్లో సాగైంది. గత నాలుగేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగు తూ వస్తోంది. ఒక్కో రైతు సొంత భూమితోపాటు 10 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. పత్తి ఏరేందుకు కూలీలు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. నాలుగేళ్లుగా మహారాష్ట్రకు చెందిన కూలీలు వస్తుండగా.. గత ఏడాది నుంచి రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు.
ఇక్కడ దొరకడం లేదు
నా స్వంత భూమితోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నా. గత నాలుగేళ్ల నుంచి పత్తి ఏరేందుకు కూలీలు దొరకడం లేదు. దొరికినా ఎక్కువ కూలి డిమాండ్ చేస్తున్నారు. నలుగురు రైతులం కలిసి మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొస్తున్నాం. ఈ ఏడాది 15 మందిని వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ ఉండేందుకు సౌకర్యాలు కల్పించినం.
– జాపాతి నారాయణ, నెన్నెల
వలస వస్తున్న కూలీలు


