జల సంరక్షణలో భేష్
పాతమంచిర్యాల: పరుగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని ఆపాలి.. ఆగిన నీటిని భూమిలో ఇంకింపజేయాలి అనే నినాదంతో జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ పనులతో జిల్లాకు పేరొచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నిర్వహించిన పనులకు గాను జిల్లా అవార్డుకు ఎంపికై ంది. నీటి సంరక్షణ పనులు సమర్థవంతంగా చేపట్టి దేశంలో, రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. నీటి నిల్వల పెంపునకు రాళ్లకట్టలు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతలు తదితర నిర్మాణ పనులు జిల్లా వ్యాప్తంగా 85,076 చేపట్టారు. 80శాతం పనుల వివరాలను డీఆర్డీఏ అధికారులు జల్ సించాయి జల్ భాగీధారి పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. గత జూలైలో భూగర్భ జల శాస్త్రజ్ఞుల బృందం సభ్యుడు కే.రాంబాబు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులకు నివేదిక పంపించారు. క్షేత్రస్థాయిలో పనులు, జల్ సించాయి జల్ భాగీధారిలో నిక్షిప్తమైన పనులను సరిపోల్చుకుని కేంద్ర జలశక్తి అధికారులు జిల్లాను అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అవార్డు రూ.2కోట్ల నగదు అందనుందని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. 18న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్ అవార్డును అందుకోనున్నారు.
మండలాల వారీగా పనులు
కోటపల్లి 6434
జైపూర్ 5580
భీమారం 5692
తాండూర్ 5306
చెన్నూర్ 4920
నెన్నెల 5066
దండేపల్లి 6335
జన్నారం 6218
కాసిపేట 6115
భీమిని 5762
వేమనపల్లి 5096
లక్సెట్టిపేట 4090
హాజీపూర్ 4231
బెల్లంపల్లి 4207
మందమర్రి 4388
కన్నెపల్లి 5723


