మళ్లీ మిల్లులకే రేషన్!
సంచులు మార్చి నేరుగా ‘సీఎంఆర్’గా అప్పగింత సన్నబియ్యం కావడంతో ధర పెంచి దళారుల దందా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీగా రీసైక్లింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ బియ్యం అటు, ఇటు తిరిగి చాటుగా మళ్లీ మిల్లులకే చేరుతోంది. మధ్యవర్తుల నుంచి దళారుల వరకు ఓ ముఠాగా మారి వ్యవస్థీకృతంగా ఈ దందా సాగుతోంది. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో ఇదంతా బట్టబయలవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నా రు. మంచిర్యాల జిల్లాల్లోని మిల్లులతో పాటు కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మిల్లులకు సన్నబియ్యం తరలిపోతోంది. గతంలో మహారాష్ట్ర సిరొంచ, వీరూర్ వరకు రోడ్డు, రైల్వే మార్గాల్లో అధికంగా సరఫరా జరిగింది. కొద్ది నెలలుగా అధి కంగా రైస్ మిల్లర్లే కొనుగోలు చేస్తూ సర్కారుకే అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ మొదలైన రెండు, మూడు నెలలపాటు లబ్ధిదారులే తీసుకున్నారు. దీంతో నిల్వల కొరత ఏర్పడింది. రెండు నెలల క్రితం ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వడంతో భారీ ఎత్తున నిల్వలు ఏర్పడ్డాయి. మళ్లీ లబ్ధిదారులతో పాటు కొందరు డీలర్లుసైతం నేరుగా దళారులకే అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రెబ్బెనలో ‘రేషన్ కింగ్’
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో కొన్నేళ్లుగా రేషన్ దందాలో ఆరితేరిన ఓ వ్యాపారి తన జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల క్వింటాళ్ల కొద్దీ బియ్యం కొంటున్నాడు. ప్ర స్తుతం సన్నబియ్యం కావడంతో ధర పెంచి కిలోకు రూ.24 చెల్లిస్తున్నాడు. అంతేకాక బియ్యం పంపే వారికి వాహనం సైతం సమకూర్చుతున్నాడు. దీంతో దళారులు గ్రామాలు, రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి రెబ్బెన వ్యాపారికి అమ్మేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్‌లో పట్టుబడిన సుమారు 90 క్వింటాళ్ల వరకు బియ్యం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. గతంలోనూ దొడ్డు బియ్యం సమయంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. అవేమీ లెక్క చేయకుండా సన్నబియ్యంలో దందా కొనసాగిస్తుండగా, తెర వెనక అధికారుల సహాయం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది.
నాణ్యత కోల్పోతున్న బియ్యం
మొదట పంపిణీ మొదలైనప్పుడు సన్నబియ్యం నాణ్యతతో ఉండగా, ప్రస్తుతం చాలా షాపుల్లో నా ణ్యత లేకుండా వస్తున్నట్లుగా లబ్ధిదారులు చెబుతున్నారు. సన్నరకంలో మార్పుతోపాటు బియ్యంలోనూ మార్పులు వస్తున్నట్లు చెబుతున్నారు. బియ్యం రీసైక్లింగ్‌లో రసాయన పరీక్ష చేసి మిల్లింగ్ చేసినవా? లేక రేషన్ బియ్యం తిరిగి అప్పగిస్తున్నారా? అని పరీక్ష చేసి రంగు మారితే రిటర్న్ పంపాలి. అయితే గోదాముల్లో తనిఖీలు నామమాత్రంగా మారడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రేషన్ బియ్యం దుర్వినియోగమవుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులను తరుచూ తనిఖీ చేస్తూ.. మిల్లింగ్ చేసే సమయంలో రోజువారీగా కరెంట్ బిల్లు, అలాగే రీసైక్లింగ్ అరికట్టేందుకు ఆ బియ్యం పాసింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తే ఈ దందాను ఆపే అవకాశం ఉంది.


