కడుపు నొప్పితో బాలుడు మృతి
నెన్నెల: తీవ్రమైన కడుపునొప్పితో బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఆవుడం గ్రామానికి చెందిన బేతు వర్షిత్‌సాయి (14) స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ బగారా రైస్, చికెన్ కర్రీ తిన్నాడు. అదేరోజు రాత్రి సొంతింటికి వచ్చాడు. ఇంట్లో మరోసారి పప్పుతో భోజనం చేశాడు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆర్‌ఎంపీ సూచన మేరకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టంలో మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
కడుపు నొప్పితో బాలుడు మృతి


