సోన్: లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో గురువారం నుంచి 11వ జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్, డీసీవో రావుల ప్రశాంతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాసర జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 14 బాలికల గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థినులు పోటీల్లో పాల్గొంటారన్నారు. ఒక్కో పాఠశాల నుంచి 85 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, పీఈటీలు రానున్నట్లు పేర్కొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికై ట్, క్యారం, చెస్, అథ్లెటిక్స్ వంటి మొత్తం 9 రకాల క్రీడలు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, సిబ్బందికి వసతితో పాటు ప్రత్యేక మెనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడలను పీడీ నీరజ, పీఈటీలు ఉదయశీల, సుస్మిత నిర్వహిస్తారని, జోనల్ ఆఫీసర్ జి.పూర్ణచందర్ రావు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రానున్నట్లు పేర్కొన్నారు.


