రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఓ వైపు అంతర్గత ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న షెడ్లు, దుకాణాలు, ప్రహరీ, కట్టడాలు కూల్చివేస్తూనే మరోవైపు విస్తరణ పనులు చేపట్టారు. రూ.8.94 కోట్ల అంచనాతో విస్తరణ పనులకు ప్రతిపాదించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి ఏఎంసీ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌నగర్ చౌరస్తా, బెల్లంపల్లి బస్తీ మీదుగా పోశమ్మ గడ్డ చౌరస్తా వరకు రోడ్డు విస్తరించనున్నారు. కూల్చివేతలు పూర్తి కాకముందే పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం చౌరస్తా ముందు నుంచి జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపట్టి సిమెంటు కాంక్రిట్‌తో పనులు చేస్తున్నారు. రూ.2.50కోట్లతో కొత్త మున్సిపల్ కార్యాలయం చౌరస్తా, ఏఎంసీ, పాత సింగరేణి జనరల్ కార్యాలయం, బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలను ఆధునికీకరించనున్నారు. షెడ్లు, దుకాణాలు కోల్పోయి నిరాశ్రయులైన వీధి వ్యాపారులకు కాంటా చౌరస్తా పక్కన బంకర్ మూసివేత ప్రాంతంలో తాత్కాలిక ప్రాతిపదికన స్థలాలు చూపించే పనుల్లో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు.


