అడెల్లి పోచమ్మకు ధాన్యాభిషేకం
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠాపన వేడుకలకు రెండోరోజు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేదపండితులు చంద్రశేఖరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో నిత్యనిధి, చండీహోమం, సహస్ర కలశ స్థాపన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జలాభిషేకం అనంతరం విగ్రహాలను నీటికొలను నుంచి వేరుచేసి ధాన్యాభిషేకం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులే కాకుండా మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులు ముందుగా తమ పేర్లు ప్రతిష్ఠాపన కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
అడెల్లి పోచమ్మకు ధాన్యాభిషేకం


