రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జన్నారం: కూలీ పనులకు వెళ్తున్న యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరాయి పేటకు చెందిన అడాయి మారుతి (25) జన్నారంకు చెందిన చుక్క గంగాధర్ అనే మేసీ్త్ర వద్ద కూలీ పనులకు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం జన్నారం వెళ్లిన మారుతి మేసీ్త్రని బైక్‌పై ఎక్కించుకుని తాళ్లపేట్ వైపు వెళ్తుండగా చింతగూడ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. మారుతి అక్కడికక్కడే మృతి చెందగా గంగాధర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఏపీలోని నూజివీడుకు చెందినట్లు గుర్తించారు. మృతుని తండ్రి భీము ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ బలరామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు
తానూరు: ఇద్దరిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు. మండలంలోని మహాలింగి గ్రామానికి చెందిన ఆనంద్, ఆదికృష్ణతో అదే గ్రామానికి చెందిన గణేశ్, తరుణ్, కిరణ్‌కు పాత గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని సోమవారం రాత్రి గణేశ్, తరుణ్, కిరణ్ ఫోన్‌చేసి ఆనంద్, ఆదికృష్ణను గ్రామ శివారులోకి పిలిపించారు. మాటామాట పెరగడంతో ముగ్గురూ కలిసి ఆనంద్, ఆదికృష్ణపై కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్సై హన్మాండ్లు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. గణేశ్, తరుణ్, కిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


