అర్హులైన గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందాలి
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలో అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జన్ మన్, ప్రధానమంత్రి జుగా, ఇతర ఆదివాసీ గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పీవోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


