పెండింగ్ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలక్రైం: ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య సూచించారు. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌పై సోమవారం కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు రాజీమార్గమే రాజమార్గమనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు అవకాశం కల్పించిందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్‌సింగ్ శ్రీనివాస్‌నాయక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్ సివిల్ జడ్జి డి.రామ్మోహన్‌రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్ పాల్గొన్నారు.


