పెళ్లింట విషాదం..!
మంచిర్యాలక్రైం: నాలుగు రోజుల క్రితమే ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కొత్త పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఎంతో ఆనందంగా గడుపుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మేనమామ పెళ్లికి వచ్చిన బాలుడు తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో ఆడుకుంటూ కిందపడిపోయి మృతిచెందాడు. ఈ హృదయ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌లోని అవినాష్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.
రేకు విరిగిపోవడంతో..
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని శాంతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలసంకుల రాజశేఖర్ –శృతి దంపతులకు కుమారుడు సహర్ష్(10), కుమార్తె సహస్ర ఉన్నారు. రాజశేఖర్ ఖానాపూర్ సమీపంలోని పెద్ద తర్లపాడ్ గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల నిర్మల్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. గత నెల 31న రాజశేఖర్ బావమరిది (శృతి తమ్ముడు) తిరుపతి వివాహం ఉండడంతో అందరూ కలిసి మంచిర్యాలకు వెళ్లారు. తిరుపతి కుటుంబంతో కలిసి గౌతమినగర్ అవినాష్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. వివాహం పూర్తి కాగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా పెళ్లి వేడుకలపై కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం సహర్ష్ తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తుపై ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ అక్క డే వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులపైకి వెళ్లాడు. ఒక్కసారిగా రేకు విరిగిపోవడంతో 5వ అంతస్తు నుంచి నేలమీద పడ్డాడు. తోటి స్నేహితులు ఏడ్చుకుంటూ వెళ్లి విషయం చెప్పడంతో వెంటనే సహర్ష్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో వివాహం జరిగిన ఇంట్లో ఆనందం ఆవిరైంది. మేనమామ తిరుపతి, సహర్ష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోధనలు కాలనీవాసులను కంటతడి పెట్టించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
పెళ్లింట విషాదం..!


