పోలీసులపై మందుబాబుల దాడి
మంచిర్యాలక్రైం: మద్యంమత్తులో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి 12.15గంటలకు జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా హెడ్‌కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ పల్లె రాజు బ్లూకోల్ట్స్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. రాజీవ్‌నగర్ నుంచి డయల్ 100కు ఫోన్ రాగా అక్కడి వెళ్లి తిరిగి వస్తుండగా సంతోష్ కిరాణం వద్ద రోడ్డుపై చిప్పకుర్తి సతీష్, సబ్బాని రాజు, నరేష్ బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పోలీసులు వారిని మందలించారు. దీంతో ఇక్కడే తాగుతామంటూ సతీష్, రాజు గొడవకు దిగారు. కానిస్టేబుళ్లలో ఒకరు వారిని వీడియో చిత్రీకరణ చేస్తుండగా.. ఎందుకు వీడియో తీస్తున్నారంటూ దాడి చేశారు. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్‌రావును సంప్రదించగా.. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన సతీష్, రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
మతిస్థిమితం లేని వృద్ధుడు మృతి
ఇంద్రవెల్లి: మతిస్థిమితం లేని వృద్ధుడు, ఇంటి నుంచి వెళ్లిపోయి ఓ వ్యవసాయ చేనులో మృతి చెందిన ఘటన మండలంలోని లక్కుగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిప్రి లక్కుగూడ గ్రామానికి చెందిన మడావి తుల్సిరాం(85) అనే వృద్ధుడు వారం రోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. పలుమార్లు కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఈనెల 31న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం దనొరా(బి) గ్రామ పంచాయతీ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో మడావి తుల్సిరాం మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాతావరణాన్ని తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.


