లోకేశ్వరం: ప్రేమవ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ప్రేమజంట వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న హృదయ విషాదకర ఘటన మండలంలోని వట్టోలి గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. వట్టోలి గ్రామానికి చెందిన భూంపల్లి అఖిల(21) డిగ్రీ మధ్యలో మానేసి ఇంటివద్ద ఉంటూ తల్లి నీలకు చేదోడువాదోడుగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్ (22) బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ఆదివారం సాయంత్రం అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే నరేశ్ కూడా బ్రహ్మేశ్వరాలయం వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నరేశ్ వేధింపుల వల్లే అఖిల ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేశ్ తల్లి ముత్తవ్వ ఇరువురి మధ్య మనస్పర్థల వల్లే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


