‘పీవీటీజీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు’
ఆదిలాబాద్‌రూరల్: పీవీటీజీల సంక్షేమానికి, అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు సకాలంలో ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నామని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పొలాం బాట కార్యక్రమంలో భాగంగా పీవీటీజీ గ్రామాలకు లింకు రోడ్లు మంజూరు చేశారని, కొన్ని జీవోలను సాకుగా చూపెట్టి మంజూరైన పనులను చేపట్టడం లేదని విమర్శించారు. గడువులోగా పనులు చేయకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని, పనులను వెంటనే చేపట్టాలని కోరారు. కుంరం సూరు యువసేనా జిల్లా అధ్యక్షుడు కుమ్ర రాజు, జలపతి, లక్ష్మణ్ పాల్గొన్నారు.


